కేవలం రు.3000 కు తాకట్టు పెట్టిన సెల్‌ఫోన్‌ ఓ యువకుడి చావుకు కారణమైయ్యింది
విశాఖలో మూడు వేల రూపాయలు ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తాకట్టు పెట్టిన సెల్‌ఫోన్‌ అడిగినందుకు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో అదికాస్తా ఓ యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. ఘర్షణలో సుత్తితో తలపై మోదడంతో గాయాలపాలైన సాయి అనే యువకుడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సింహాద్రిపురం కొండవాలు ప్రాంతంలో కర్రిసాయి అనే యువకుడు నివాసముంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మోహన్‌ కుమార్‌.. సాయికి స్నేహితుడు. సాయి తన సెల్‌ఫోన్‌ను మోహన్‌ వద్ద తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టిన సెల్‌ఫోన్‌ విడిపించుకునేందుకు సాయి.. మోహన్‌ దగ్గరకు వెళ్ళాడు. ఈ విషయంలో శుక్రవారం నాడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో.. సహనం కోల్పోయిన మోహన్‌.. అక్కడే ఉన్న సుత్తితో సాయి తలపై మోదాడు.
తీవ్ర గాయమైన సాయిని స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి మృతిచెందాడు. మూడు వేల రూపాయల అప్పు ఉన్న సాయి.. ఆ బాకీని తీర్చేందుకు వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోయాడాని ఆవేదన చెందుతున్నారు మృతుడి బంధువులు. దాడి జరిగిన నేపథ్యంలో హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు సాయి మృతిచెందడంతో హత్యకేసుగా ఆల్టర్‌ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మూడు వేలరూపాయలు, సెల్‌ఫోన్‌ కోసం ఇలా ఓ యువకుడి ప్రాణాలు పోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *