విశాఖలో ఆపరేషన్ మొదలుపెట్టిన జగన్ సర్కార్

విశాఖపట్నంపై జగన్ సర్కార్ నజర్ పెట్టింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా కొల్లగొట్టిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పనిని మొదలుపెట్టింది. ప్రభుత్వ భూములను అధికారులు ఒక్కటొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. విశాఖ నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణల్ని గుర్తించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలిసిన  ఆక్రమ నిర్మాణాలను తొలగించింది. ఏకంగా 66.5 ఎకరాల ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంది.


మరోవైపు లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన వారిపైనా చర్యలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు ప్రత్యూష అసోసియేట్స్ ప్రతినిధి పరుచూరి భాస్కర్ రావుకు షాక్ తగిలింది. ఆయన ఆక్రమణలోని భూములను శనివారం స్వాధీనం చేసుకున్నారు. అగ్రహారంలో ఆయన ఆధ్వర్యంలో 124 ఎకరాల భూమి ఉంది. ఇందులో 64 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. ఈ 64 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. రక్షణ గోడలు షెడ్లు గేట్లు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.


ఈ భూముల విలువ ఏకంగా 256 కోట్లు  ఉంటుందని తేల్చారు. విశ్వనాథ ఎడ్యుకేషన్ సంస్థ కబ్జా చేసిన వాగు పోరంబోకు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం మార్కెట్ విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనావేస్తున్నారు. సిరిపురంలోని ఫ్యూజన్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్ను విశాఖ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్టు గుర్తించారు. చంద్రబాబు సన్నిహితుడు టి. హర్షవర్ధన్ ప్రసాద్ కు చెందిన హోటల్ గా దీన్ని పేర్కొంటున్నారు. విశాఖలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు గుర్తించి ఎక్కడ ఆక్రమణలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని ఆర్డీవో కిషోర్ తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *