జూనియర్ ఎన్టీఆర్ కు టిడిపి పగ్గాలు ఇవ్వడం పై బాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

జూన్ 10 నందమూరి బాల కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమా లు మొదలుకొని రాజకీయాల వరకు అనేక అంశాల పై మనసు విప్పి మాట్లాడారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం పై బాలకృష్ణ ఆసక్తికరమైన రీతి లో స్పందించారు. వివరాల్లోకి వెళితే… బాల కృష్ణ ని ఇంటర్వ్యూ చేసిన టీవీ ఛానల్ యాంకర్, టిడిపి పగ్గాలను చంద్రబాబు బాలకృష్ణ చేతిలో పెడితే స్వీకరిస్తారా? ఆ దిశ గా బాలకృష్ణ ఆలోచించారా ? చంద్రబాబు ను ఏదైనా సందర్భంలో టిడిపి పగ్గాలు ఇవ్వమని బాలకృష్ణ కోరారా? అన్న ప్రశ్నలు సంధించారు.


అయితే దీనికి ముక్కు సూటిగా స్పందించిన బాలకృష్ణ తాను ఎప్పుడూ పార్టీ పగ్గాలు ఇవ్వమని చంద్ర బాబు ని కోర లేదని వెల్లడించారు. అలా అడిగే వ్యక్తిత్వం తనది కాదని ఆయన వ్యాఖ్యానించారు అయితే నిజం గా అలాంటి సందర్భం వస్తే పార్టీ పగ్గాలు తీసుకోవడానికి వెనుకాడనని, ఆ సమర్థత తనకు ఉందని, కానీ అందుకు బలమైన సందర్భం రావాలని ఆయన అన్నారు. అయితే ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోవాలని పలువురు బాహాటంగా కోరుతున్నారని, దీనిపై ఏమంటారని టీవీ యాంకర్ బాల కృష్ణ ని ప్రశ్నించారు. దీనికి బాల కృష్ణ సూటిగా సమాధానం ఇవ్వలేదు. యాంకర్ అడిగిన ప్రశ్న కు సమాధానం ఇస్తూ ఎవరు తోచినట్లు వారు కోరుకోవడంలో తప్పు లేదని, ఫలానా వారు పార్టీ పగ్గాలు తీసుకోవాలని అభిమానులు కోరుకోవడం లో కూడా తప్పు లేదని, కానీ కేవలం సినిమా హీరో కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పగ్గాలు తీసుకోవాలని అనుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి చెందని టీవీ యాంకర్ మరింత సూటి ప్రశ్న బాల కృష్ణ పై సంధించారు.


జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకుంటే అది పార్టీ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని ప్రశ్నించారు. దీనికి బాలకృష్ణ సమాధానం ఇవ్వకుండా చాలాసేపు పాజ్ ఇచ్చి గట్టి గా నవ్వారు. అయితే బాలకృష్ణ సమాధానం దాట వేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధమై కూడా యాంకర్ అదే ప్రశ్న తిరిగి సంధించగా బాలకృష్ణ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. అది ప్లస్ అవ్వచ్చు లేక మైనస్ అవ్వచ్చు, ఒక్కోసారి ముందు ప్లస్ అయి ఆ తర్వాత మైనస్ కావచ్చు, అలా ముందు ప్లస్ అయి తర్వాత మైనస్ కావడం మంచిది కాదు, ముందు మైనస్ అయి ఆ తర్వాత ప్లస్ అయితే పర్వాలేదు కానీ ముందు ప్లస్ అయి ఆ తర్వాత మైనస్ అవ్వడం మంచిది కాదు అంటూ సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. మరి బాలకృష్ణ సమాధానం అర్థం అయిందో లేదో తెలియదు గాని యాంకర్ ఆ ప్రశ్న పై సంభాషణ అక్కడితో ముగించారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు ఇవ్వడం అనే విషయంపై బాలకృష్ణ అంత సానుకూలంగా స్పందించలేదు అన్నది మాత్రం ఇంటర్వ్యూ చూసిన వారికి అర్థమైంది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *