భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తహసీల్దార్ ఇబ్బందులు.. కార్యాలయంలోనే రైతు ఆత్మహత్యాయత్నం

తన  భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించిన ఘటన వికారాబాద్ జిల్లాలోని దోమ మండలంలో నిన్న జరిగింది. తిమ్మాయిపల్లికి చెందిన రైతు సత్తయ్య (35)కు అదే గ్రామంలో ఎకరం పొలం ఉంది. ఇటీవల ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న సత్తయ్య తన పొలాన్ని విక్రయించేందుకు ఓ రియల్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుని కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు.


భూమిని అతడి పేర రిజిస్టర్ చేసేందుకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. సత్తయ్య భూమి విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న పక్కభూమి రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు. భూ కొలతలు వేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చాడు. మరోవైపు, నాలుగు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అడ్వాన్స్ తీసుకున్న వ్యక్తి సత్తయ్యపై ఒత్తిడి పెంచాడు. రిజిస్ట్రేషన్ చేయకుంటే తన డబ్బు వెనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో నిన్న కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న సత్తయ్య రిజిస్ట్రేషన్ చేయమని కోరగా, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అక్కడే ధర్నాకు దిగాడు.


దీంతో తహసీల్దార్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి, వెళ్లిపోయారు. ఈ క్రమంలో సత్తయ్య వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన అక్కడే ఉన్న పోలీసులు, కార్యాలయ సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సత్తయ్య విషయమై తహసీల్దార్ వాహెదాఖాతూన్ మాట్లాడుతూ.. అదే సర్వే నంబరుపై ఇతర రైతుల పొలాలు ఉండడంతో సర్వే సంఖ్య సబ్ డివిజన్ కాలేదని, దీంతో రెండు రోజుల సమయం అడిగామని తహసీల్దార్ తెలిపారు. ఫిర్యాదు చేసిన రైతుతో మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పామని వివరించారు.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *