దేశంలో తొలి గ్రీన్ ఫంగస్ కేసు నమోదు !

మనదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంతటి అలజడిని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కరోనా సెకండ్ విజృంభణ సమయంలోనే పలు రకాల ఫంగస్ లుకూడా వెలుగులోకి వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ తో  పాటు వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇవి చాలవన్నట్లు తాజాగా తొలిసారిగా గ్రీన్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ వ్యక్తిలో గ్రీన్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. అరబిందో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 34 ఏళ్ల వ్యక్తి పరీక్షలు చేయగా సైనస్ ఊపిరితిత్తుల్లో ఫంగస్ జాడలు కనిపించాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనితో వెంటనే అతన్ని ముంబైలోని ఓ హాస్పిటల్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.


ఈ ఫంగస్ బ్లాక్ వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ఇండోర్ లోని రూబీ ఆర్చర్డ్ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కొద్ది రోజుల కిందట కరోనా బారినపడి కోలుకున్నాడు. అనంతరం కరోనా అనంతర లక్షణాలతో మళ్లీ ఆసుపతిలో చేరాడు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు చేయగా ఊపిరితిత్తులు సైనస్లో ఆస్పెర్ గిలోసిస్ ఫంగస్ ను గుర్తించారు. ఉపిరితిత్తుల్లో 90శాతం ఇన్ఫెక్షన్ జరిగిందని ఆ తర్వాత అతన్ని చార్టర్డ్ విమానం ద్వారా తరలించగా ఇప్పుడు హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి సుమారు ఒకటిన్నర నెలల క్రితం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తుల్లో చీము నిండి ఉందని దాన్ని తొలగించేందుకు చాలా ప్రయత్నాలు చేసినా విజయవంతం కాలేదని తెలిపారు. చికిత్స సమయంలో రోగిలో వివిధ రకాల లక్షణాలు గమనించామని అదే సమయంలో అతనికి జ్వరం 103 డిగ్రీల కంటే దిగువకు చేరలేదని వైద్యులు తెలిపారు.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *