ఆకాశాన్ని అంటుతున్న అమెరిక ఫ్లైట్ ధర

తెలుగు వారికి కొత్త కష్టం ఎదురవుతోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు కిందామీదా పడుతున్న వారికి.. గుడ్డిలో మెల్లగా మారిందన్న సంతోషానికి తూట్లు పొడుతున్న పరిస్థితి వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా తెలుగు నేలకు.. అమెరికాకు మధ్య దూరం ఎంతలా తగ్గిపోయిందన్నది తెలిసిందే. 1990 వరకు ఒకలా.. ఆ తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పుల పుణ్యమా అని.. ప్రతి తెలుగు కుటుంబానికి సంబంధించిన వారో.. వారి దగ్గర బంధువులో కనీసం ఇద్దరు ముగ్గురు అమెరికాలో సెటిల్ అయిన పరిస్థితి నెలకొంది.


దీంతో.. కలలో కూడా ఊహించని వేలాది మంది అమెరికాకు వెళ్లి తమ కుటుంబ సభ్యుల్ని కలిసి వస్తున్నారు. కరోనా వేళ.. ఇలాంటి ట్రిప్పుల్ని పక్కన పెడితే.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే వారికి దిమ్మ తిరిగేలా షాక్ తగలటమే కాదు.. తాజాగా పెరిగిన విమాన ఛార్జీలు బొమ్మ కనిపించేలా చేస్తున్నాయి. తెలుగు నేల మీద నుంచి అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా విమాన ఛార్జీలు కనిష్ఠంగా రూ.90వేలు..గరిష్ఠంగా రూ.2.20 లక్షలకు పెరిగిన పరిస్థితి. గతంలో రూ.50-60 వేలకు మించని విమాన టికెట్ల ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. దీంతో.. విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. పెరిగిన విమాన ఛార్జీలు పెను భారంగా మారాయని చెబుతున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో విమానాలు అందుబాటులోకి రావటం.. అమెరికాకు వెళ్లే వారు ఎక్కువ కావటంతో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. దీనికి తోడు కరోనా థర్డ్ వేవ్ మాట నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని తక్కువగా నడుపుతున్నారు.


దీంతో.. విమాన టికెట్ ధరలు పెద్ద ఎత్తున పెరిగినట్లు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కేసులు భారత్ నుంచి వచ్చే వారి ద్వారా సోకుతున్నాయన్న అపోహలు కూడా అమెరికా విమాన సర్వీసులు తగ్గటానికి కారణంగా చెబుతున్నారు. అమెరికాు వెళ్లే విమానాల్లో అధికశాతం దుబాయ్.. దోహా.. బ్రిటన్ లలో ఏదో ఒక మార్గం నుంచి వెళ్లే విషయం తెలిసిందే. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమానాలు దుబాయ్.. బ్రిటన్ దేశాల్లో ఆగేందుకు అనుమతులకు గతంలో ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ ఆంక్షల్ని జులై 31 వరకు పొడిగించటంతో పలు విమాన యాన సంస్థలు తమ సర్వీసుల్ని రద్దు చేశారు. దీంతో.. తక్కువ సంఖ్యలో విమాన సర్వీసులు అందుబాటులో ఉండటంతో.. విమాన టికెట్ ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. దీంతో.. అమెరికాకు వెళ్లే విద్యార్థుల మీదా.. వారి కుటుంబాల మీదా భారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *