కనగరాజ్‌కు పదవిచ్చేసిన ఎపి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీకి చైర్మన్‌గా మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌ను నియమించింది. కొన్నాళ్ల కిందట.. ఏపీ సర్కార్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాత్రికి రాత్రి తొలగించి కనగరాజ్‌తో ప్రమాణస్వీకారం చేయించింది. ఆ నియామాకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దాంతో ఆయన పదవి కోల్పోయారు. నిమ్మగడ్డ పదవి కాలం పూర్తయిన తర్వాత కనగరాజ్‌ను నియమిస్తారని చాలా మంది అనుకున్నారు కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదు.


దీంతో జస్టిస్ కనగరాజ్‌ను వాడుకుని వదిలేశారన్న విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఏదో ఓ పదవి ఇవ్వాలని సంకల్పించింది. ఆయన స్థాయికి తగ్గట్లుగా ఉండే పదవి కోసం అన్వేషించింది. ఈ సమయంలో సుప్రీంకోర్టు.. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు చాలా రోజుల కిందట ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ అధారిటీని ఏర్పాటు చేసి… చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీని ఏర్పాటు చేశారు.


హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. చైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. పోలీసులపై తమకు అందే ఫిర్యాదులపై విచారణ జరిపి.. చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. పీసీఏ సిఫారసులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయం. ఇలాంటి కీలకమైన పోస్టుకు కూడా… గతంలో రాజకీయంగా తమకు ఉపయోగపడతారని తమిళనాడు నుంచి తెచ్చుకున్న వ్యక్తికి పదవి ఇవ్వడం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *