లాక్‌డౌన్ కొత్త సడలింపులు.. తెలంగాణలో నేటి నుంచి మారేవి ఇవే

తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ లో కొత్త సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. నేటి నుంచి లాక్ డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్టీసీ, మెట్రో సర్వీసులు మరింతగా అందుబాటులోకి రానున్నాయి.

నేటి(జూన్ 10,2021) నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపు అందరూ ఇళ్లకు చేరుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిన్నటి వరకు మ.2గంటల వరకే అవకాశం ఉండేది. ఇక ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు సాయంత్రం 6 వరకూ నడవనున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. మరోవైపు సాయంత్రం 6 నుంచి తిరిగి ఉదయం 6 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. నేటి నుంచి 10 రోజులు ఇలాగే ఉండనుంది.


అక్కడ సడలింపులు లేవు:
సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో ఆయా నియోజకవర్గాల పరిధిలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ వేళల్లో మార్పులు లేకుండా యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో మే 12 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చి మిగతా టైంలో కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేశారు. లాక్ డౌన్ తర్వాత కేసుల సంఖ్య తగ్గడంతో మరోసారి లాక్ డౌన్ ను సడలించి జూన్ 9 వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇప్పుడా సడలింపు సమయాన్ని మరింత పెంచింది ప్రభుత్వం. కేసుల తగ్గుతుండడంతో సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్‌ అమలవుతుంది. ఇందులో భాగంగానే ప్రజా రవాణ అయిన ఆర్టీసీ బస్సులు, రైళ్లు, మెట్రో వంటి వాటికి సడలింపులు ఇచ్చింది.


ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు సమయాల్లో మార్పులు:

తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు మినహా పగటి పూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసిన వేళ బస్సు సర్వీసుల వేళలను TSRTC పొడిగించింది. సడలింపులకు అనుగుణంగా 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలకు నడిపే బస్సులను తిప్పనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మెట్రో ప్రయాణికులకు కూడా ఊరట లభించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. చివరి రైలు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు 6 గంటల వరకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *