పనబాక టీడీపీలో ఉన్నట్లా.. లేనట్లా..?

పనబాక లక్ష్మి. ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. ఆమె అడ్రస్ మళ్లీ ఎవరికీ చిక్కడం లేదు. 2019 ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ నుంచి జంప్ చేసి టీడీపీలోకి వచ్చిన ఆమెకు వరుస పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. ఒకప్పుడు..  విజయాలు దక్కించుకున్న ఆమె ఇప్పుడు పరాజయాలతో కుంగిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. 2019లో టీడీపీ తరఫున తిరుపతి పార్లమెంటుకే పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. అయితే.. ఇక్కడ నుంచి గెలిచిన దుర్గాప్రసాద్ మరణంతో.. తిరిగి ఉ ప ఎన్నిక రాగా.. మరోసారి పనబాక ఓడిపోయారు. ఈ రెండు సార్లు ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఈ క్రమంలో పనబాక వర్గంగా ఉన్న కొందరు కాంగ్రెస్లోని సీనియర్లు మరికొందరు టీడీపీ సీనియర్లు కూడా.. పనబాకకు టీడీపీ రాజకీయాలు వర్కవుట్ కావడం లేదని అంటున్నారు.


కాంగ్రెస్ తరహా రాజకీయాలకు అలవాటు పడిన పనబాక.. టీడీపీలో ఉన్న రాజకీయాలకు.. నేతలను కలుపుకొని పోయే విధానాలకు ఆమె అలవాటు పడలేదని చెబుతున్నారు. పైగా.. గత 2019 ఎన్నికల తర్వాత.. మళ్లీ ఇటీవల జరిగిన ఉప ఎన్నిక వరకు కూడా పనబాక ఎవరికీ కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు ఈ ఎన్నిక తర్వాత.. మరోసారి ఆమె ఇంటికే పరిమితయ్యారు. దీంతో ఆమె అసలు టీడీపీలో ఉన్నారని అనుకుంటున్నారా ?  లేక కాంగ్రెస్లోనే ఉన్నానని ఫీలవుతున్నారా ?  అంటున్నారు.


కాంగ్రెస్లో అయితే.. అధిష్టానం గెలిపిస్తుందని.. లేదా అధిష్టానం ఊపుతో క్షేత్రస్థాయిలో నేతలు విజయం దక్కించుకుంటారని.. కానీ టీడీపీ విషయంలో అటు అధిష్టానంతోపాటు.. క్షేత్రస్థాయిలో నేతలు కూడా కలిసి మెలిసి కార్యకర్తలను ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికలకుముందు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతే.. ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునే అవకాశం కూడా లేదని చెబుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు అన్న విధంగా.. ఏపార్టీలో ఉంటే.. ఆ పార్టీ విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తేనే ఫ్యూచర్ ఉంటుందని సూచిస్తున్నారు. ఇక పనబాక సైకిల్ దిగే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయని మరో టాక్ కూడా వినిపిస్తోంది.Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *