జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా

వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. దీంతో వైసీపీ శ్రేణులు.. ఏపీ నాయకులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామ కృష్ణరాజు.. హైదరాబాద్లోని సీబీఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జగన్ ప్రస్తుతం.. సాక్ష్యులను ప్రభావితం చేసే పదవిలో ఉన్నారని.. ఆయన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. జగన్పై ఉన్న కేసుల్లో నిందితులుగా ఉండి.. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన వారికి ఇప్పుడు కీలక పదవులు కట్టబెట్టారని..ఆయన ఆరోపించారు.


అదేసమయంలో కొందరు గతంలో జైలుజీవితం గడిపి వచ్చిన ఉన్నతాధికారులకు ప్రమోషన్లు ఇచ్చి.. తనకు సానుకూలంగా వ్యవహరించేలా జగన్ మలుచుకున్నారని.. రఘురామ పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. జగన్ బెయిల్ రద్దు కోరుతూ.. ఆయన సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్ పెద్ద సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే అనేక దఫాలు విచారణ జరిగినా.. సీబీఐ ముందు ఒక రకంగా తన వైఖరి వినిపించగా.. తర్వాత.. మళ్లీ మనసు మార్చుకుంది. తొలుత.. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చన్న సీబీఐ.. గత విచారణ సమయంలో అఫిడవిట్ దాఖలు చేస్తామని.. వివరించింది.


దీంతో కేసు వాయిదా పడుతూ వచ్చింది. ఇక జగన్ వైపు నుంచి వేసిన అఫిడవిట్లో .. రఘురామ కేవలం రాజకీయ కక్ష పూరిత వ్యవహారంలోనే తనపై ఈ కేసు వేశారని.. జగన్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఇక తాజాగా ఈ రోజు జరిగిన విచారణలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసేందుకు.. అఫిడవిట్ ఇచ్చేందుకు మరింత సమయం కోరింది. సీబీఐ తరఫున న్యాయవాదులు(పబ్లిక్ ప్రాసిక్యూటర్లు) ఇద్దరూ.. అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ క్రమంలో లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు ఆలస్యమవుతోందని పేర్కొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *