ఇన్ సైడర్ ట్రేడింగ్: సుప్రీంలో కీలక వాదనలు

రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ ఏపీ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. తమకు వ్యతిరేకంగా ఈ తీర్పురావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లు వినీత్ శరణ్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

రాష్ట్ర ప్రభుత్వం వాదనలు ఆలోచనలు వినకుండా హైకోర్టు ఈ తీర్పు వెలువరించిందని.. తాము లేవనెత్తిన ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోనందున ఈ పిటీషన్ పై విచారణ చేపట్టాలని దుష్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆస్తుల కొనుగోలులో అధికారులు నేతలు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారన్నారు. దీనిపై స్పందించిన ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చినట్లు తాము గమనించామని పేర్కొంది.  ఈ అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు తమకు కనిపించడం లేదంటూ దుష్యంత్ దవే వాదనలతో విభేదించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 19కి వాయిదా వేసింది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు వివరాలివీ..

అమరావతి ఏర్పాటుకు ముందే చంద్రబాబు అండ్ కో ఆ ప్రాంతంలో భూములు కొని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ సర్కారు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన సంగతి తెలిసిందే..దీనిపై సీఐడీ విచారణకు కూడా ఆదేశించింది.  ఈ విచారణలో టీడీపీ నేతలు వారి బినామీలు కోట్లాది రూపాయల విలువైన భూములు కొన్నారని సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. పాన్ కార్డు కూడా లేని ఐటీ రిటర్న్స్ లేని పేదలు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొన్నారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఈ మేరకు నాగమణి నరసింహారావు అనురాధ కొండలరావు భుక్యా నాగమణి  అబ్దుల్ జమేదార్ లపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో మాజీ మంత్రులైన టీడీపీ నేతలు నారాయణ పత్తిపాటి పుల్లారావులపై కేసులు నమోదయ్యాయి. దాదాపు 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు బహిరంగ మార్కెట్లో రూ.276కోట్ల విలువైన భూములు కొన్నట్టు తేల్చారు. ఇందులో పాన్ కార్డు లేని వారు 529 మంది ఉన్నారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇందులో భాగంగానే తాజాగా ఏడుగురిపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులను హైకోర్టు కొట్టివేయడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *