ఒమిక్రాన్ వల్ల డెల్టా వేరియంట్ సోకే అవకాశాలు చాలా తక్కువ ??

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ పేరు అంటేనే జనం కంగారు పడుతున్నారు. దీనిని ఎదుర్కొవడానికి దాదాపు అన్ని దేశాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే వందకుపైగా దేశాల్లో ఈ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ కు అతివేగంగా వ్యాప్తి చెందే గుణం ఉందని నిపుణులు తేల్చారు.సౌత్ ఆఫ్రికాలో ఈ తొలి కేసు నమోదైనప్పటి నుంచి విస్తృత స్థాయిలో అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్రికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ వేరియంట్ పై పరిశోధనలు నిర్వహించింది. అందుకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

ఆఫ్రికా శాస్త్రవేత్తలు బృందం ఒమిక్రాన్ పై నిర్వహించిన అధ్యయనాల్లోని ఫలితాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఒమిక్రాన్ కు ముందు కోరలు చాచిన డెల్టా వేరియంట్ కు ఈ కొత్త వేరియంట్ చెక్ పెడుతుందని వారు తేల్చారు. వాస్తవానికి అతిప్రమాదకరమైన డెల్టా వల్లే కరోనా తీవ్ర రూపం దాల్చింది. భారత్ లో పుట్టిన డెల్టా వేరియంట్ అతి ప్రమాదకరం అని నిపుణులు గతంలో తేల్చారు. అందుకే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వైరస్ విలయ తాండవం చేసింది.
వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీని ధాటికి ఎంతోమంది ఉక్కిరిబిక్కరి అయ్యారు. ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. అయితే ఒమిక్రాన్ వల్ల డెల్టా వేరియంట్ సోకే అవకాశాలు చాలా తక్కువ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా మన శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుందని వెల్లడించారు.

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో డెల్టాను నియంత్రించే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని నిపుణుల పరిశోధనలో తేలింది. ఒమిక్రాన్ ప్రభావం కూడా మానవ శరీరంపై చాలా తక్కువ అని తేలింది. ఈ వేరియంట్ సోకిన వారిలో అతిస్వల్ప లక్షణాలు కలుగుతున్నాయి.

అంతేకాకుండా ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని నిపుణులు ఇదివరకే చెప్పారు. ఆస్పత్రుల పాలయ్యే అవకాశం లేదని వివరించారు. రోగనిరోధక శక్తి మరీ తక్కువగా ఉన్నవారికి మాత్రమే వైద్యుల పర్యవేక్షణ అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా కొత్త వేరియంట్ సోకితే డెల్టా వేరియంట్ రీ ఇన్ ఫెక్షన్ కు అవకాశాలు చాలా తక్కువ అని వారు అభిప్రాయపడ్డారు.
డెల్టా వేరియంట్ బారిన పడి ఎంతోమంది పిట్టల్లా రాలిపోయారు. ఊపిరిఆడక చేతుల్లోనే ప్రాణాలు విడిచారు. ప్రాణవాయువు కొరత ఏర్పడింది. ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎందరినో రిక్వెస్ట్ చేశారు. ఆ వేరియంట్ కారణంగానే మనదేశంలో రెండో వేవ్ వచ్చింది. అయితే కరోనా మరో వేరియంట్ కూడా అంతే ప్రమాదకరం అని అంతా భావించారు.

జెట్ స్పీడ్ లో వ్యాపించే ఒమిక్రాన్… థర్డ్ వేవ్ కు కారణమవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా శాస్త్రవేత్తల అధ్యయనాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఒమిక్రాన్ వచ్చినా కూడా…మన మంచికేననే అభిప్రాయం కలుగుతోంది. అతి స్వల్ప లక్షణాలు గల కొత్త వేరియంట్… ప్రమాదకరమైన డెల్టా నుంచి రక్షణ పొందేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా మరికొన్నాళ్లు ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *