మహిళా మంత్రులుగా ఎవరు ఔట్.. ఎవరు ఇన్..?
సీఎం జగన్ కేబినెట్ ప్రక్షాళనకు సమయం చేరువ అవుతోంది. వచ్చే డిసెంబరులోపు మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని అంటున్నా రు. కేబినెట్ కూర్పు సమయంలోనే జగన్.. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంది మంత్రులను మారుస్తానని చెప్పారు. ప్రస్తుతం రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన ఉండనుంది. దీంతో పురుష అభ్యర్తులను పక్కన పెడితే.. మహిళా అభ్యర్తులు కూడా భారీ ఎత్తున వచ్చే ప్రక్షాళనలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు మహిళా మంత్రులు జగన్ కేబినెట్లో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఎస్సీ ఎస్టీలకే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. గుంటూరుకు చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్నారు. ఈమెను కదిలించే అవకాశం లేదని తెలుస్తోంది. బహిరంగ వేదికలపై `నా చెల్లి` అని జగన్ చెబుతుండడంతో రేపు ఇదే సెంటిమెంటు అడ్డు రావొచ్చు. అయితే.. శాఖ మార్చినా.. ఆమెకు మంత్రి పదవి పదిలమే.. అంటున్నారు పరిశీలకులు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిని పక్కకు తప్పిస్తారని.. కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది.దే సమయంలో ఎస్సీ వర్గానికే చెందిన తానేటి వనితను కూడా జగన్ పక్కన పెడతారని అంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఎవరిని తీసుకునే అవకాశం ఉంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో మహిళా ఎమ్మెల్యేలు కొందరు ఇదే విషయంపై సలహాదారు సజ్జలతో భేటీ అవుతున్నారు. వీరిలో పాలకొండ(ఎస్టీ) విశ్వసరాయి కళావతి ముందు వరుసలో ఉన్నారు. ఈమె వరుస విజయాలు దక్కించుకుని పార్టీకోసం కృషి చేస్తున్నారు వివాద రహితురాలు.. అనే ప్లస్లు బాగానే ఉన్నాయి. అదే సమయంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి(ఎస్సీ) కూడా ఈ రేసులో ఉన్నారు. ఇక్కడ కూడా పార్టీని డెవలప్ చేసేందుకు ఆమె బాగానే కష్టపడ్డారు. అదే సమయంలో ఆమె భర్త రెడ్డి వర్గం నేత కావడం ఆమెకు ప్లస్..! ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజా కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఇప్పటికేఆమెకు ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి ఇచ్చినందున కేబినెట్ బెర్త్ కష్టమే  అనే టాక్ వినిపిస్తోంది. ఇక గుంటూరుకు చెందిన చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ(బీసీ) అందరికన్నా ఎక్కువగా కేబినెట్లో చోటు కోసం తాపత్రయ పడుతున్నారు. తొలిసారి విజయం దక్కించుకున్న ఈమె.. స్థానికంగా హల్ చల్ చేస్తున్నారు. అయితే.. ఇదే నియోజకవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్కు గత ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పుకొంటే.. మంత్రి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా చూస్తే.. ముగ్గరు మంత్రుల్లో ఇద్దరు బయటకు వచ్చినా.. క్యూలో మాత్రం.. ఐదారుగురు కనిపిస్తుండడం గమనార్హం. మరి ఎవరికి ఛాన్స్ చిక్కుతుందో చూడాలి.
Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *