నన్ను కెప్టెన్ గా నియమిస్తారనుకుంటే ధోనీకి అవకాశం ఇచ్చారు: యువరాజ్ సింగ్

వన్డేల్లో 8 వేలకు పైగా పరుగులు, 17 అంతర్జాతీయ సెంచరీలు (వన్డేలు, టెస్టుల్లో కలిపి) సాధించి, 100కు పైగా వన్డే వికెట్లను తన ఖాతాలో వేసుకున్న భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, అనేక మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించి భారత్ కు లభించిన ఆణిముత్యంలా వెలుగొందాడు. అయితే కెరీర్ లో మాంచి ఊపుమీదున్న దశలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని అభిమానులు భావించారు. కానీ, అనూహ్య రీతిలో క్యాన్సర్ బారినపడి, ఆటగాడిగానూ ప్రాభవం కోల్పోయాడు. తాజాగా ఓ పోడ్ కాస్ట్ లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీపై ఆసక్తికర అంశాలు వెల్లడించాడు.


2007 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా తనకు సారథ్యం అప్పగిస్తారని ఆశించానని, కానీ సెలెక్టర్లు ధోనీని కెప్టెన్ గా నియమించారని తెలిపాడు. “ఆ సమయంలో భారత్ వన్డే వరల్డ్ కప్ లో పరాజయం పాలైంది. ఆ సమయంలో ఇంగ్లండ్ టూర్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ పర్యటనలు ఉన్నాయి. అదే సమయంలో టీ20 వరల్డ్ కప్ కూడా వచ్చింది. దాంతో జట్టు నాలుగు నెలల పాటు విదేశాల్లోనే ఉండాల్సిన పరిస్థితి. దాంతో జట్టులోని సీనియర్లు చాలామంది విరామం తీసుకోవాలని భావించి, టీ20 వరల్డ్ కప్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమయంలో నాకు కెప్టెన్సీ ఇస్తారని గట్టిగా భావించాను. కానీ ధోనీ పేరు ప్రకటించారు.


ధోనీ కెప్టెన్ అయిన తర్వాత అతడికి నేను సహకరించాను. రాహుల్ ద్రావిడ్ అయినా, సౌరవ్ గంగూలీ అయినా… ఎవరు కెప్టెన్ అయినా జట్టులో ఉన్న ఆటగాళ్లు సహకరించాల్సిందే. నేను కూడా అందుకు మినహాయింపు కాదు” అని యువీ వివరించాడు. కాగా, 2007 టీ20 వరల్డ్ కప్ లో భారత్ టైటిల్ విజేతగా నిలవడంలో యువీ కీలకపాత్ర పోషించాడు. యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 6 సిక్సులు బాదింది ఈ టోర్నీలోనే. ఆ తర్వాత ధోనీ నాయకత్వంలో 2011 వరల్డ్ కప్ గెలవడంలోనూ ఈ ఎడమచేతివాటం ఆల్ రౌండర్ దే ప్రధాన భూమిక.


Share With:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *